
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో నిత్యం నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ఫోటోలను సేకరించి తమకు నచ్చిన అంశాన్ని జోడించి ప్రచారం చేస్తున్నారు. దీంతో.. ప్రజలలో భయాందోళన సృష్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ వార్తలు చూస్తున్న జనం సహజంగానే భయపడిపోతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. టెక్ట్స్‌తో కూడిన ఒక ఇమేజ్ ఫైల్‌ను, దాంతో పాటు.. కొన్ని ఫోటోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
దావా:
సోషల్‌మీడియాలో వైరల్ అయిన పోస్ట్‌లో రాసిన టెక్ట్స్ గమనిస్తే… ”దయచేసి స్నేహితులందరికీ ఫార్వార్డ్ చేయండి. భారతదేశం అంతటా హైదరాబాద్ పోలీసుల నుంచి సమాచారం అందించబడింది. దయచేసి maaza, fanta, 7UP, coca cola, mountain dew, pepsi, వంటి శీతల పానీయాలను రాబోయే కొద్దిరోజులు తాగవద్దు. ఎందుకంటే ఈ కంపెనీలలో ఒకదాని కార్మికుడు ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ యొక్క కలుషిత రక్తాన్ని చేర్చుకున్నాడు. ఈ వార్త నిన్న NDTV ఛానెల్లో చెప్పారు. దయచేసి ఈ సందేశాన్ని వీలైనంత త్వరగా నకిలీ చేయడం ద్వారా హాయం చేయండి. మీ కుటుంబంలో ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి. మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. – ధన్యవాదాలు. ” అని ఉంది.
వాస్తవ తనిఖీ :
వైరల్ అవుతున్న ఫోటోలోని సందేశం తప్పు అని విశ్వాస్ న్యూస్ ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడయ్యింది. ఈ వాదనను సమర్థించే కథనాలుగానీ, నివేదికలు గానీ కనిపించలేదు.
హైదరాబాద్ పోలీసులు ఈ హెచ్చరికలు జారీచేశారని పోస్టులో రాశారు. దీంతో.. మేము హైదరాబాద్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో శోధించడం జరిగింది. అయితే.. అందులో వైరల్ దావాకు సంబంధించిన హెచ్చరికలు గానీ, సూచనలకు సంబంధించిన ప్రకటన గానీ కనిపించలేదు. తెలంగాణ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మేము శోధించాము. దీనికి సంబంధించిన ప్రకటన ఏదీ కనిపించలేదు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క అధికారిక వెబ్సైట్లో, ఎబోలాకు సంబంధించిన కొన్ని అంశాలు మేము కనుగొన్నాము : ‘ఎబోలా వైరస్ సాధారణంగా ఆహారం ద్వారా వ్యాపించదు. అయినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో, బుష్ మీట్ (అడవి జంతువులు ఆహారం కోసం వేటాడటం) నిర్వహణ మరియు వినియోగం ద్వారా ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుంది.’
ఈ వైరల్ పోస్టులో మొదటి ఫోటో 2015లో నకిలీ కోకాకోలా తయారుచేసే స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసినప్పటిది. ఈ లింకులో ఆ వివరాలు చూడొచ్చు.
అంతేకాదు.. వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు ఎన్డిటివి వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానెల్‌ను శోధించాము. కీవర్డ్స్‌తో కూడా ప్రయత్నించాము. కానీ, అలాంటి వార్తా కథనం ఏదీ ఎన్డీటీవీలో ప్రసారం కాలేదు.
అయినా నిర్ధారించుకోవడానికి ఎన్డిటివి హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఉమా సుధీర్‌ని సంప్రదించాము. ఆ వార్తా కథనం ఎన్డీటీవీలో ప్రసారం కాలేదని క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి ఈ ప్రచారం గత యేడాది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు హిందీలో రూపొందించిన టెక్ట్స్‌తో ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగులోనే ఆ టెక్ట్స్‌ను అనువదించి సోషల్ మీడియా యూజర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విశ్వాస్ న్యూస్‌లో ప్రచురితమైన ఫ్యాక్ట్‌చెక్ కథనాన్ని ఈ లింకులో చూడవచ్చు.
निष्कर्ष: ఎబోలా సోకిన వైరస్‌తో శీతల పానీయాలు కలుషితం అయ్యాయంటూ వైరల్ అయిన పోస్ట్ నకిలీ అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.