
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : మతాంతర వివాహాలకు సంబంధించి బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ కేబినెట్ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిందని, దాని ప్రకారం ముస్లిం బాలుడు ముస్లిమేతర బాలికతో ప్రేమలో పడటం నేరమని, ఆ నేరానికి 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని సోషల్ మీడియా యూజర్లు ఒక పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ దావా నకిలీదని తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర న్యాయ కమిషన్ ఈ వాదనలను ఖండించింది, మరియు వైరల్ పోస్ట్ చేసిన వాళ్లు ఆర్డినెన్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.
దావా :
చాలా మంది వినియోగదారులు ట్విట్టర్లో ఒక వైరల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు, ”యుపి క్యాబినెట్ ‘లవ్ జిహాద్’ ఆర్డినెన్స్‌ను పాస్ చేసింది. ఇప్పుడు ముస్లిమేతర బాలికతో ముస్లిం బాలుడు ప్రేమలో పడటం 5 సంవత్సరాల జైలు శిక్షతో కూడిన నేరమే. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కువగా దుర్వినియోగం చేయబడే అవకాశం ఉంది.” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఫేస్బుక్లో ఈ వాదనను ఫోటోలతో కలిపి పంచుకున్నారు.
దర్యాప్తు :
ఉత్తర ప్రదేశ్ కేబినెట్ నవంబర్ 24వ తేదీన ‘యుపి చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్’ను ఆమోదించింది, బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే ఈ చట్టం కింద10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.’ పెళ్లి సాకుతో బలవంతంగా మత మార్పిడి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ అవసరం” అని జాగరణ్ జోష్లోని ఒక వార్తాకథనం పేర్కొంది.
బలవంతంగా మతమార్పిడికి పాల్పడితే 1-5 సంవత్సరాల జైలుశిక్ష మరియు 15 వేల రూపాయల జరిమానాను విధించేలా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు, మరియు మైనర్ లేదా ఎస్సీ / ఎస్టీ మహిళలను బలవంతంగా మత మార్పిడి చేసినట్లయితే, జైలు శిక్ష 3-10 సంవత్సరాలకు పెరుగుతుంది, మరియు జరిమానా 25,000 రూపాయల దాకా విధించడం జరుగుతుంది. కమ్యూనిటీ సామూహిక మార్పిడి విషయంలో, ఉల్లంఘించిన వ్యక్తి 3-10 సంవత్సరాల మధ్య జైలు శిక్షను అనుభవిస్తాడు. ఒకవేళ ఈ చర్య వెనుక ఏదైనా సంస్థ ఉన్నా, సామూహికంగా మత మార్పిడులకు పాల్పడినా, 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. సంబంధిత సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది.
ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా వివాహం కోసం మతం మార్చుకోవాలనుకుంటే, అతను / ఆమె సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌కు రెండు నెలల ముందుగానే నోటీసు ఇవ్వవలసి ఉంటుందని ఆ కథనం స్పష్టం చేసింది. ఒకవేళ ఆ వ్యక్తి అలా చేయలేకపోతే, ఉల్లంఘించిన వ్యక్తికి కనీసం 10,000 రూపాయల జరిమానా మరియు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు.
అయితే, వైరల్ దావాను ధృవీకరించే వార్తా కథనాలు ఏవీ మాకు దొరకలేదు.
కొత్త ఆర్డినెన్స్ గురించి మరింత స్పష్టత కోసం విశ్వాస్ న్యూస్ ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ను సంప్రదించింది. జస్టిస్ ఆదిత్య నాథ్ మిట్టల్ (మాజీ న్యాయమూర్తి, హైకోర్టు, అలహాబాద్), ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ కమిషన్ చైర్మన్ ఈ నకిలీ వాదనలను ఖండించారు. ‘యుపి చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్’ బలవంతపు మత మార్పిడులను మాత్రమే నిరోధిస్తుంది. ఇది స్వచ్ఛంద మత మార్పిడులను అనుమతిస్తుంది. అయితే, ఇది తప్పుడు వివరణలతో ప్రచారమవుతోంది.’ అని మిట్టల్ చెప్పారు.
ఈ ఆర్డినెన్స్‌లో ఉన్న అంశాలను ఆయన వివరిస్తూ.. చట్టవిరుద్ధమైన మత మార్పిడులకు మూడు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ కమిషన్ కార్యదర్శి సప్నా త్రిపాఠి కూడా స్పందించారు. వైరల్ అవుతున్న పోస్ట్‌లో పేర్కొన్న వాదన ప్రకారం ఈ ఆర్డినెన్స్ ఏ నిర్దిష్ట మతానికి వ్యతిరేకం కాదని, కేవలం చట్టవిరుద్ధమైన మతమార్పిడులను మాత్రమే నిరోధిస్తుందని స్పష్టం చేశారు.
వైరల్ పోస్ట్‌ను షేర్చేసిన ఫేస్బుక్ యూజర్ షాజ్ దార్ యొక్క సోషల్ స్కానింగ్‌లో అతను డెహ్రాడూన్‌లో నివసిస్తున్నాడని, ఫేస్బుక్లో అతనికి 301 మంది ఫాలోవర్లు ఉన్నారని తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. ‘యుపి చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్’ బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తుంది. జిల్లా మేజిస్ట్రేట్‌కు రెండు నెలల ముందస్తు నోటీసుతో స్వచ్ఛందంగా మతం మార్చుకునేవారిని ఈ ఆర్డినెన్స్ అనుమతిస్తుంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.